అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy Meeting | జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర జీవన్ రెడ్డి తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ముఖ్య కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి Revanth Reddy సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితులపై చర్చించేందుకు ఈ భేటీ నిర్వహించినట్లు తెలిపారు.
Revanth Reddy Meeting | ఏనాడూ తక్కువ చేయలేదు..
ఈ సందర్భంగా Jeevan Reddy పార్టీని వీడిన అంశంపై సీఎం స్పందించారు. తాము ఎనాడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదని పేర్కొన్నారు. ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఎనాడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పార్టీ శ్రేణులు చాలా కష్టపడ్డాయని గుర్తుచేశారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో జీవన్‌రెడ్డిని కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించామని.. కానీ, ఆయన అభ్యర్థన మేరకు నిజామాబాద్ నుంచి టికెట్ ఇచ్చినప్పటికీ ఓటమి చెందారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డి సూచించిన వారికే టికెట్లు ఇచ్చామని గుర్తుచేశారు.
Revanth Reddy Meeting | త్వరలోనే జగిత్యాల పర్యటన..
భవిష్యత్తులో ఆయనతోపాటు తన కుటుంబ సభ్యులకు రాజకీయంగా పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినా, జీవన్‌రెడ్డి పార్టీని వీడారని సీఎం చెప్పారు. నాలుగు దశాబ్దాల పాటు తనతో పనిచేసిన కార్యకర్తలను నిరాశపరిచారని ఈ సందర్భంగా విమర్శించారు. K. Chandrashekar Raoతో జీవన్‌రెడ్డి కలవడం బాధాకరమని సీఎం వ్యాఖ్యానించారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడటం తమ బాధ్యత అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, త్వరలోనే జగిత్యాల పర్యటనకు వస్తానని హామీ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన కార్యకర్తలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. జగిత్యాల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
