అక్షరటుడే, వెబ్‌డెస్క్: West Asia War Impact | ఇరాన్- అమెరికా మధ్య ప్రారంభమైన యుద్ధం ఎనిమిదో వారంలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం కాల్పుల విరమణ అమలులో ఉన్నా అనిశ్చితులు కొనసాగుతున్నాయి. మొదటి దశ చర్చలు విఫలమవగా.. రెండో దశ చర్చలపై ఇంకా స్పష్టత రాలేదు.
మరోవైపు ఈ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు భారీగా పెరగడంతో చాలా దేశాలలో ధరలను పెంచేశారు. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచే అవకాశాలున్నాయి. గ్యాస్‌కు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
West Asia War Impact | నెమ్మదించనున్న ఆర్థిక వృద్ధి..
ప్రస్తుత సంక్షోభం ఇలాగే కొనసాగితే ప్రపంచ వృద్ధి 2 శాతం కంటే తక్కువకు పడిపోవచ్చని ఐఎంఎఫ్ తన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ రిపోర్టులో పేర్కొంది. ఇదే జరిగితే ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. 1980 తర్వాత నాలుగుసార్లు ఇలా జరిగిందని తెలిపింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతాయని, ధరల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుందని అభిప్రాయపడింది. కొన్ని దేశాల్లో ఆహార భద్రత సమస్యలు కూడా తలెత్తవచ్చని హెచ్చరిస్తోంది.
West Asia War Impact | ఏ దేశాలకు లాభమంటే..
పశ్చిమాసియాలోని అనిశ్చిత పరిస్థితులు ఏయే దేశాలపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతాయన్న అంశంపై ఐఎంఎఫ్ (IMF) అంచనాల్ని వెలువరించింది. సౌదీ అరేబియా, చైనా, రష్యా వంటి దేశాలు హార్ముజ్ జలసంధిపై పెద్దగా ఆధారపడవు. దీంతోపాటు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలను కలిగి ఉన్నాయి. దీంతో వీటిపై యుద్ధ ప్రభావం పెద్దగా ఉండదని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. చమురు ధరల పెరుగుదల వల్ల రష్యా లబ్ధి పొందుతుందని, వచ్చే ఏడాది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 1.1 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తోంది.
West Asia War Impact | ఏ దేశాలకు నష్టమంటే..
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేతతో కొన్ని దేశాల్లో ఆహార ధరలు పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ హెచ్చరిస్తోంది. జాంబియాలో అత్యధికంగా 30 శాతానికిపైగా ఆహార ధరలు పెరగవచ్చని, శ్రీలంకలో 15 శాతానికిపైగా పెరుగుతాయని, తైవాన్‌లో 12 శాతం, పాకిస్థాన్‌లో 11 శాతానికిపైగా ధరలు పెరుగుతాయని అంచనా వేసింది. భారత్‌లోనూ 10.7 శాతం మేర ధరలు పెరగవచ్చని అభిప్రాయపడుతోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంతో ఇంధన సంక్షోభం కారణంగా బ్రిటన్ అత్యధికంగా ప్రభావితం అవుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 2026లో ఖతార్, ఇరాక్ ఆర్థిక వ్యవస్థ కూడా క్షీణిస్తుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Israel Lebanon Talks | ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య నేడు చర్చలు : ట్రంప్
