అక్షరటుడే, వెబ్‌డెస్క్: KKR IPL 2026 Failure | ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారుతోంది. మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు, ఈసారి మాత్రం పూర్తిగా విఫలమవుతూ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది.
KKR IPL 2026 Failure | అన్ని మ్యాచుల్లో ఓటమి
ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయిన కేకేఆర్, కేవలం వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్ వల్ల వచ్చిన ఒక పాయింట్‌తోనే పాయింట్ల పట్టికలో నిలిచింది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో ఓడిపోవడం జట్టు దుస్థితిని మరింత బహిర్గతం చేసింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రెండూ పూర్తిగా విఫలమయ్యాయి.
KKR IPL 2026 Failure | పాతిక కోట్లు పెట్టి కొన్నా ఉపయోగం లేదు..
బౌలింగ్‌లో సునీల్ నరైన్ (Sunil Narine) తప్ప మిగతా బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోతున్నారు. అయితే జట్టు వైఫల్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నది ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ . మినీ వేలంలో రూ.25.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన గ్రీన్, ఇప్పటివరకు పూర్తిగా నిరాశపరిచాడు. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందులో ఒక మ్యాచ్‌లో చేసిన 32 పరుగులు మినహాయిస్తే, మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో అతని ప్రదర్శన పూర్తిగా నిరాశాజనకంగా ఉంది. బౌలింగ్‌లో కూడా గ్రీన్ ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి 30 పరుగులు ఇవ్వగా, మొత్తం సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. అతని ఎకానమీ రేటు 14.50గా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భారీ ధర పెట్టి తీసుకున్న ఆటగాడు జట్టుకు భారంగా మారడం కేకేఆర్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
KKR IPL 2026 Failure | రింకూ సింగ్ కూడా
ఇక మరో కీలక ఆటగాడు రింకూ సింగ్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేయడం అతని ఫామ్‌పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అలాగే వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) కూడా బౌలింగ్‌లో పూర్తిగా ఫామ్ కోల్పోయి, ప్రత్యర్థులకు సులభంగా పరుగులు ఇస్తున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఫిన్ అలెన్, అజింక్యా రహానేలు కూడా నిరాశపరుస్తున్నారు. యువ ఆటగాడు రఘువంశీ మాత్రమే కొంతవరకు ఫర్వాలేదనిపిస్తున్నాడు. మొత్తం మీద జట్టులో స్థిరత్వం పూర్తిగా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం చాలా కష్టంగా కనిపిస్తోంది. మరో మూడు మ్యాచ్‌లు ఓడితే అధికారికంగా రేసు నుంచి తప్పుకునే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను చూస్తే జట్టు చివరి స్థానంలో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ సీజన్ ముగిసిన తర్వాత కేకేఆర్ జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రూ.25 కోట్లకు కొనుగోలు చేసిన గ్రీన్ ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అభిమానులు కూడా మేనేజ్‌మెంట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Praful Hinge | నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ ఓటమిని శాసించిన ఎస్ఆర్‌హెచ్ బౌలర్.. అప్పుడు లెదర్ బాల్ అంటే కూడా తెలియదట..
