అక్షరటుడే, వెబ్డెస్క్ : Constitutional Amendment Bill | కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు బిల్లులకు ఆమోదం లభించలేదు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది.
కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ, మహిళా రిజర్వేషన్ (Women Reservations), డీలిమిటేషన్ బిల్లులను లోక్సభలో ప్రవేశ పెట్టింది. 2026 జన గణన ఆధారంగా మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపింది. అలాగే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచుతామని తెలిపింది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన విపక్షాలు.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాయి. ఇందులో భాగంగా రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్ జరగ్గా వీగిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు మొత్తం 528 ఓట్లు పోల్ కాగా.. అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో వీగిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్తో లింక్ ఉంది. దీంతో కేంద్రం ఆ బిల్లులపై ఓటింగ్ నిర్వహించలేదు.
Constitutional Amendment Bill | ప్రతిష్టాత్మకంగా..
కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. బిల్లులపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుకు మద్దతు తెలపాలని ప్రధాని మోదీ అన్ని పార్టీలను కోరారు. అయినా కూడా విపక్షాలు ఏకతాటిపై నిలిచాయి. బిల్లు ఆమోదం పొందకుండా పక్కాగా వ్యవహరించాయి.
Constitutional Amendment Bill | మెజారిటీ లేకపోవడంతో..
ప్రస్తుతం బీజేపీ (BJP)కి సభలో పూర్తిస్థాయి మెజారిటీ లేదు. కూటమిలోని ఇతర పక్షాలతో కలిసి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందడం కష్టం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం వాటిని తీసుకురావడం గమనార్హం. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఎన్నికల వేళ ఆ బిల్లులను తీసుకు వచ్చింది. విపక్షాలు బిల్లులను అడ్డుకోవడంతో దానిని బీజేపీ ప్రచార అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. అయితే ఇతర బిల్లుల ఆమోదానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Constitutional Amendment Bill | వాటి పరిస్థితి ఏమిటి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలు (One nation One Election), ఉమ్మడి పౌరస్మృతి (UCC) తీసుకు రావాలని కొంతకాలంగా యత్నిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న బలంలో అది సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. తాజాగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ఇప్పట్లో కేంద్రం ఆ బిల్లుల జోలికి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది.
దీనిని కూడా చదవండి : Excise CI Bribery Case | ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్ సీఐ
