అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tech Layoffs 2026 | ప్రపంచ ఐటీ రంగం మరోసారి కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా తర్వాత కొంత కాలం స్థిరంగా కనిపించిన ఉద్యోగ పరిస్థితి, ఇప్పుడు మళ్లీ లేఆఫ్స్ రూపంలో దెబ్బతింటోంది. తాజా నివేదికల ప్రకారం, ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 వేల మంది టెక్ ఉద్యోగులు (Tech Employees) తమ ఉద్యోగాలను కోల్పోయారు.
2021 నుంచి ఇప్పటివరకు మొత్తం 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు లేఆఫ్స్‌కు గురైనట్లు వెల్లడైంది.ఈ వివరాలను ట్రేడింగ్ విశ్లేషణలు అందించే సంస్థలు విడుదల చేసిన రిపోర్టులు వెల్లడించాయి. ముఖ్యంగా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెట్టడం వంటి కారణాలు ఈ లేఆఫ్స్‌కు దారితీశాయని నివేదికలు పేర్కొన్నాయి.
Tech Layoffs 2026 | ఉద్యోగాల కోత..
ఇటీవల టెక్నాలజీ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), ఆటోమేషన్ వైపు కంపెనీలు మరింతగా మొగ్గుచూపుతున్నాయి. దీని ప్రభావం ఉద్యోగాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ తొలగింపులు పూర్తిగా ఆటోమేషన్ వల్లనే కాదని, భవిష్యత్తు అనిశ్చితులను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ముందస్తు చర్యలుగా ఖర్చులను నియంత్రించేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రిపోర్ట్ ప్రకారం, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS) రంగాల్లోనే ఉద్యోగాల కోతలు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన లేఆఫ్స్‌లో దాదాపు 77 శాతం అమెరికాలోనే నమోదవడం గమనార్హం. ఇది ఆ దేశంలోని టెక్ కంపెనీలపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని ప్రతిబింబిస్తోంది.
Tech Layoffs 2026 | దాదాపు 2,400 మందిని తొలగించినట్లు సమాచారం
ప్రముఖ కంపెనీల విషయానికి వస్తే, ఒరాకిల్ సుమారు 26 వేల ఉద్యోగులను, అమెజాన్ 16 వేల మందిని, మెటా దాదాపు 2,400 మందిని తొలగించినట్లు సమాచారం. ఈ సంఖ్యలు ఐటీ రంగం (IT Sector)లో ఉన్న ఒత్తిడిని స్పష్టంగా చూపిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏఐ కేవలం భవిష్యత్తు టెక్నాలజీ మాత్రమే కాకుండా, కంపెనీల వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. నియామకాలు, ఉద్యోగాల కోతలు, సంస్థల పునర్నిర్మాణం వంటి అంశాల్లో ఇది ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో ప్రస్తుత పరిస్థితులు త్వరగా మెరుగుపడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, నూతన టెక్నాలజీలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకునే ఉద్యోగులకు భవిష్యత్తులో అవకాశాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Constitutional Amendment Bill | కేంద్రానికి బిగ్ షాక్.. వీగిపోయిన కీలక బిల్లులు
