అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drinking Water Supply | వేసవి సీజన్ దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు. ప్రతి నివాస ప్రాంతానికి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా పర్యవేక్షణ జరపాలని చూడాలన్నారు.
ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం (Armoor Constituency) పరిధిలోని డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్, ఆలూర్, ఆర్మూర్ మండలాల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
Drinking Water Supply | మండలా వారీగా సమీక్ష..
ఒక్కో మండలంలోని ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతు పనులు తదితర వాటి గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గతేడాది వేసవిలో ఏయే ప్రాంతాల్లో దాహార్తి సమస్యలు ఉత్పన్నం అయ్యాయని ఆరా తీశారు. ఈసారి ఎల్‌నినో ప్రభావం వల్ల సరిపడా వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నందున, తాగునీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలని, చివరి ప్రాంతాలు, ఎత్తయిన ప్రదేశాల్లోని నివాసాలకు సైతం నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Drinking Water Supply | జిల్లా అధికారుల దృష్టికి తేవాలి
ఏవైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని, సకాలంలో పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా మంచినీటి కోసం ప్రజలు నిరసనకు దిగితే, సంబంధిత ఎంపీడీవోలను (MPDO) బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులతో సమన్వయాన్ని పెంపొందించుకుని, ప్రతి గ్రామంలో, మున్సిపల్ వార్డుల్లో ప్రజల అవసరాలకు సరిపడా పూర్తిస్థాయిలో రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. చేతి పంపులు, బోరు బావులకు తక్షణమే ఫ్లషింగ్ చేయించాలని చెప్పారు.
Drinking Water Supply | తాగునీటి పైప్లైన్లను ధ్వంసం చేస్తే..
తాగునీటి (Drinking Water) సరఫరా వ్యవస్థకు ఆటంకం కలిగేలా పైప్లైన్లను ధ్వంసం చేయడం, వాల్వ్ లకు నష్టం చేకూర్చే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని కలెక్టర్ చెప్పారు. మంచినీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, ఎంపీవోలు, ఏఈలు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేందర్, డీపీవో శ్రీనివాస్ రావు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్, మిషన్ భగీరథ ఈఈ రాకేష్, నియోజకవర్గం పరిధిలోని మండలాల ఎంపీడీవోలు, ఏఈలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Loan Waiver Issue | రుణమాఫీ అడిగితే కోర్టుల చుట్టూ తిప్పుతారా?.. కాంగ్రెస్ సర్కార్‌పై వేముల నిప్పులు
