అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Thota Chandrasekhar | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ (Thota Chandrasekhar) అనూహ్యంగా జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం (Janasena Party Office)లో జరిగిన ఈ భేటీతో ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న తోట చంద్రశేఖర్ ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆయన మళ్లీ జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
Thota Chandrasekhar | మెగా బ్రదర్స్‌కి సన్నిహితుడిగా..
తోట చంద్రశేఖర్ మహారాష్ట్ర (Maharastra) కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2008లో స్వచ్ఛంద విరమణ తీసుకున్న ఆయన, అనంతరం ఆదిత్య హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించి, మెగా బ్రదర్స్‌కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. తరువాత ఆయన రాజకీయ ప్రయాణం మారింది. వైఎస్సార్‌సీపీ తరఫున 2014లో ఏలూరు లోక్‌సభ (Eluru Lok Sabha) స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మళ్లీ జనసేనలో చేరి కీలక బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు.
Thota Chandrasekhar | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు
మూడేళ్ల క్రితం ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నిర్ణయం ద్వారా కాపు వర్గాన్ని ఆకర్షించాలనే వ్యూహంతో కే చంద్రశేఖర్ రావు ముందుకు వచ్చినట్లు అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తోట చంద్రశేఖర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మళ్లీ పవన్ కళ్యాణ్‌ని కలవడం ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయా? లేక రాజకీయ పునరాగమనానికి సంకేతమా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఈ భేటీపై జనసేన వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల ముందు పార్టీని వీడకుండా ఉంటే తోట చంద్రశేఖర్ గుంటూరు జిల్లాలో కీలక నాయకుడిగా ఎదిగేవారని పార్టీ అనుచరులు భావిస్తున్నారు. ఆయన తిరిగి పార్టీలోకి వస్తే బలమైన నాయకత్వం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: TTD VIP Darshan Cancel | టీటీడీ కీలక నిర్ణయం.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
