అక్షరటుడే, వెబ్‌డెస్క్ : AE Caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు పనుల నిమిత్తం వచ్చే వారిని డబ్బుల పేరిట వేధిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. తాజాగా ఓ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ (Municiapal AE) లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.
కరీంనగర్ (Karimnagar) జిల్లా హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పని చేస్తున్న నుసుమ్ సుధాకర్ రెడ్డిని వల పన్ని పట్టుకున్నారు. ఓ వ్యక్తి హుజురాబాద్‌లో వర్షపు నీటి కాలువల నిర్మాణం చేపట్టాడు. సంబంధిత బిల్లుల కోసం ఏఈని కలిశారు. కాలువ పనులకు సంబంధించి కొలతలను నమోదు చేసి, తుది బిల్లును ప్రాసెస్ చేయడానికి సదరు ఏఈ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ (ACB) అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదిదారుడి నుంచి హుజూరాబాద్‌లోని చౌరస్తా వద్ద లంచం తీసుకుంటుండగా.. ఏఈని ఏసీబీ అధికారులు (AE Caught by ACB) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
AE Caught by ACB | అవినీతి కేంద్రాలుగా..
రాష్ట్రంలో పలు మున్సిపల్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా బిల్లుల చెల్లింపులు, ఇంటి అనుమతుల కోసం భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా మాముళ్లు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. అదే డబ్బులు ఇవ్వకపోతే అన్ని ఉన్నా.. అనుమతులు ఇవ్వడం లేదు.
ఇటీవల ఏసీబీ అధికారులు పలు మున్సిపల్ కార్యాలయాపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమాల నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే తనిఖీల ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో అవినీతి అధికారులు భయపడటం లేదు. లంచాలు తీసుకోవడం తమ హక్కుగా భావిస్తున్నారు. ఏసీబీ కేసుల్లో దొరికిన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి: KTR comments | భూములు కబ్జా చేస్తున్న సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
