అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Road Safety | హైదరాబాద్ (Hyderabad)ను రోడ్డు ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దడంలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని సీపీ సజ్జనార్ (CP Sajjanar) అన్నారు. రహదారి ప్రమాదంలో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతుందని, అటువంటి విషాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ – అలైవ్’ (Arrive Alive )కార్యక్రమంలో బుధవారం టీజీఐసీసీసీ ఆడిటోరియంలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులతో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ (Traffic Police) విభాగం అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వాహనదారులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడే భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.
Hyderabad Road Safety | నో హెల్మెట్– నో ఎంట్రీ
ఖైరతాబాద్ జోన్ పరిధిలోని 10 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నుంచి సుమారు 400 మంది కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీపీ మాట్లాడుతూ.. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు తమ ప్రాంగణాల్లో ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ బోర్డులను ఏర్పాటు చేసి, కఠినంగా అమలు చేయాలని సూచించారు.
Hyderabad Road Safety | సమస్యలు పరిష్కరిస్తాం
ప్రజలు స్థానిక ట్రాఫిక్ సమస్యలను వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. వాటిని ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి కేంద్ర ప్రభుత్వం ‘రహ్ వీర్’ స్కీం ద్వారా నగదు పురస్కారంతో పాటు చట్టపరమైన రక్షణ కల్పిస్తోందన్నారు. భయపడకుండా బాధితులకు సాయం చేయాలని సూచించారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడటం వంటి చర్యలు ప్రాణాంతకమని హెచ్చరించారు.
దీనిని కూడా చదవండి : Fake Goodknight Refills | హైదరాబాద్‌లో నకిలీ గుడ్‌నైట్ దందా ఖేల్ ఖతం
