అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Strait of Hormuz Tensions | పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు మరోసారి తీవ్రమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ మరోసారి కఠిన వైఖరి అవలంభించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగితే ఈ సముద్ర మార్గాన్ని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ శనివారం హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియాలో చేసిన ప్రకటనలపై గాలిబాఫ్ ఘాటుగా స్పందించారు. “ట్రంప్ ఒక గంటలోనే ఏడు అబద్ధాలు చెప్పారు. యుద్ధంలో గెలవలేని వారు చర్చల ద్వారా ఏమీ సాధించలేరు” అని విమర్శించారు. హర్మూజ్ జలసంధిని తెరవాలా, మూసివేయాలా అన్నది సోషల్ మీడియా (Social Media) పోస్టులు నిర్ణయించవని, అది తమ సైనిక దళాల ఆధీనంలో ఉంటుందని స్పష్టం చేశారు.
Strait of Hormuz Tensions | చమురు ధరలు పెరిగే అవకాశం..
ఇకపై ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు తప్పనిసరిగా ఇరాన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, తాము సూచించే మార్గాల ద్వారానే ప్రయాణం సాగించాలని గాలిబాఫ్ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఆందోళన నెలకొంది. ఇది జరుగుతుండగానే, కొద్ది రోజుల క్రితం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Minister Abbas Araqchi) కాల్పుల విరమణ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకలకు తిరిగి తెరిచినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన ట్రంప్, ఇరాన్ ఇకపై ఈ మార్గాన్ని మూసివేయబోదని పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేయడం టెహ్రాన్‌కు ఆగ్రహం తెప్పించింది.
Strait of Hormuz Tensions | జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ మళ్లీ కఠిన వైఖరిని అవలంబిస్తూ, దిగ్బంధనం కొనసాగితే జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఒకవేళ ఈ మార్గం మూసివేస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇక అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కూడా అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా జరిగిన తొలి విడత చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో రెండో విడత చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Pakistan Army Chief Asim Munir) మధ్యవర్తిత్వం వహిస్తూ టెహ్రాన్‌ను సందర్శించి చర్చలకు మార్గం సుగమం చేయాలని ప్రయత్నించారు. అయితే చర్చలు ముందుకు సాగుతున్న తరుణంలోనే హర్మూజ్ జలసంధి అంశంపై మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి..: Hormuz Strait Reopens | ఇరాన్ గుడ్‌న్యూస్.. తెరుచుకున్న హర్ముజ్ జలసంధి
