అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tejasvi Surya | తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఫైర్ అవుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులు మండిపడ్డారు.
Tejasvi Surya | పొన్నం ఘాటు వ్యాఖ్యలు
లోక్ సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ సూర్య తెలివిలేని వెదవ అని ఘాటు వ్యాఖ్యలతో మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటుపై అజ్ఞానంగా మాట్లాడారని అతడి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన పొన్నం.. తేజస్వీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తేజస్వీ సూర్యపై చర్య తీసుకోవాలని లోక్‍సభ స్పీకర్‌కు లేఖ రాయనున్నట్లు చెప్పారు.
Tejasvi Surya | తెలంగాణపై నరనరాన వ్యతిరేకత: కేటీఆర్
తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నాయకులు మరోసారి తమ ద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం మూర్ఖత్వమన్నారు. తెలంగాణను కించపరిచిన తేజస్వి సూర్య తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
Tejasvi Surya | పార్లమెంట్‌లో క్షమాపణ చెప్పాలి: హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ ఆవిర్భావంతో పోల్చడం ఏమిటని మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పార్లమెంట్ వేదికగా ఒక ఎంపీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. భారత సమాఖ్య స్ఫూర్తిపై బీజేపీకి ఉన్న అజ్ఞానాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Lok Sabha | మూడు కీలక బిల్లులపై రేపు లోక్‌సభలో ఓటింగ్
